జగన్ పాద నమస్కారం చేశారు… ఆ స్వామి చేయనిచ్చారు.

Ys Jagan Touches to tridandi Chinna Jeeyar Swami Feet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన పెదరాయుడు సినిమాలో నటుడు ఎమ్మెస్ ఓ డైలాగ్ చెబుతారు. “ఇన్నేళ్ళలో ఎప్పుడూ చూడలేనిది ఒకటి చూసాను. ఎన్నడూ వినలేను అనుకున్నది విన్నాను. పెదరాయుడు కంట నీరు, ఆయన నోటి వెంట క్షమించు అన్న మాట ” … ఈ డైలాగ్ జనాలకి బాగా ఎక్కింది. పెదరాయుడు సినిమా విజయంలో ఈ డైలాగ్ కి భారీ క్రెడిట్ వుంది. అలాంటి డైలాగ్ ఇప్పుడు మరోసారి కళ్ళ ముందే సాక్షాత్కరించింది. వైసీపీ అధినేత జగన్ ఇంకొరికి పాద నమస్కారం చేయడం, సామాన్య భక్తులకి ఎడం ఎడం గా జరిగే చినజీయర్ తన పాదాల్ని జగన్ తాకుతున్నా కదలకుండా ఉండడం. నిజానికి ఇదేమీ పెద్ద విశేషం కాకపోయినా జగన్ , చినజీయర్ కి దగ్గరగా వుండే వాళ్లకి ఈ రెండు పెద్ద విషయాలే.

వైసీపీ అధినేత జగన్ మీద వున్న ప్రధాన ఆరోపణ ” పెద్దల్ని, పార్టీ నాయకుల్ని ఆయన గౌరవించరని”. ఇందులో నిజానిజాలు ఆయనతో దగ్గరగా మసిలిన వారికే తెలుసు. జగన్ సామాన్య ప్రజల దగ్గరికి చేరువగా వస్తారు. అందులో ఏ సందేహం లేదు. అయితే ఎవరికీ పాద నమస్కారం చేయడం అంతకుముందు కనిపించలేదు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవిద్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి జగన్ పాద నమస్కారం చేశారు. మళ్లీ ఇప్పుడు చినజీయర్ స్వామికి అలా పాద నమస్కారం చేయడం చూస్తున్నాం. కాలం, అవసరం ఎంత వారి నైనా మారుస్తాయి అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ?

ఇక చినజీయర్ స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా పలువురు పారిశ్రామికవేత్తలు భక్తులుగా వున్నారు. ఆయన దగ్గరగా వెళ్లాలంటే పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యమని ఇప్పటికే ఓ టాక్ వుంది. సామాన్యుల్ని అంత దగ్గరికి రానివ్వరని కూడా అంటారు. ఇందుకు ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. ఒకప్పుడు టీవీ ఛానల్ అధిపతిగా వున్న ఓ రాజుగారు చినజీయర్ కి పరమ భక్తుడు. ఆయన కోరిక మేరకు స్వామి ఛానల్ కి వచ్చినప్పుడు అక్కడ న్యూస్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని చూసి లేచి నుంచున్నారు. స్వామికి న్యూస్ విభాగం పని తీరు వివరించారు. అంతా అయిపోయాక స్వామీజీ అరటిపండ్లని ప్రసాదంగా ఇవ్వదలిచారు. భక్తితో దగ్గరకి వెళ్లిన వారికి దాదాపు విసిరినట్టు ఆయన ప్రసాదం అందజేయడం కళ్లారా చూసాం. మర్యాద పాటించి అలాగే ప్రసాదం తీసుకున్నాం. సామాన్యుల్ని ఇలా చూసేందుకు కూడా స్వామి అనుచరులు కొన్ని కారణాలు చెబుతారు. స్వామి నిత్య పూజల్లో వుంటారు కాబట్టి మాంసాహారం తినేవాళ్లు, తప్పులు చేసే వాళ్లకి కాస్త దూరంగా ఉంటారని అంటారు. లేకుంటే స్వామిజీ ” ఆరా” తగ్గిపోతుందట.

అయినా అన్ని తెలిసిన స్వాములకు ఈ తరతమ భేదాలు తగవని చెప్పే స్థాయి మనకు ఎక్కడిది ?. అందుకే స్వామి వారు ఎంతో ఆరాధించి భారీగా విగ్రహ ప్రతిష్టాపన తలపెట్టిన రామానుజాచార్యుల వారి జీవితం నుంచి ఓ ఘట్టాన్ని గుర్తు చేసుకుందాం. రామానుజాచార్యులు గురువు గోస్తి పూర్ణ. రామానుజులు ఎంతో అడిగిన మీదట ఆయన శిష్యుడికి ఎంతో ఉన్నతమైన ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రం విన్నవారు, పఠించిన వారి జీవితాలు పునీతం అవుతాయని, అయితే అర్హత లేని వారికి చెప్పొద్దని గురువు రామానుజులకి చెప్పారు. అయినా జనం జీవితాల్ని పునీతం చేసేందుకు రామానుజులు ఓ గుడి గోపురం ఎక్కి మరీ ఆ మంత్రాన్ని బిగ్గరగా ప్రజలకు వివరించారు. కోపం వచ్చిన గురువు గారు ఇలా చేసినందుకు శిక్ష అనుభవిస్తావని అంటే జనం కోసం దాన్ని స్వీకరించడానికి సిద్ధం అని చెప్పారు. ఇది లోకం ఎరిగిన విషయం. ఇక ఆయన్ని ఆరాధించే పీఠాధిపతులకి, స్వాములకు ఈ విషయం ఎందుకు తెలియదు ?