దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు.
అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్‌స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది.