పద్మ శ్రీ పురస్కారానికి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారనే సంగతి అందరికీ తెలిసిందే. వీరు కాకుండా ఒడిశా కోటా నుంచి మరో తెలుగు వ్యక్తి పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన పేరు దేవరపల్లి ప్రకాశ్ రావు. ఒడిశాలోని కటక్‌లో టీ స్టాల్ నడుపుతూ సాధారణ జీవనం సాగించే వ్యక్తికి పద్మ శ్రీ ఎలా ఇచ్చారా ? అని ఆయన గురించి గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు. అందుకే ఆయన గురించి కొన్ని విషయాలు సేకరించి మీ ముందు ఉంచుతున్నాం. ఆయన కటక్ లో ఒక తీ స్టాల్ నడుపుతూ ఉంటాడు. కాకినాడ దగ్గరున్న రేచర్లపేట నుంచి జీవనోపాధి కోసం కాలి నడకన బయల్దేరిన ప్రకాశరావు ముత్తాత అలుపు వచ్చి కటక్ లో ఆగాడు. ఇక అదే వారి నివాస స్థలం అయ్యింది. ప్రకాశ రావు తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేశారు. కటక్ తిరిగి వచ్చాక ఆర్థిక పరిస్థితి దిగజారడంతో జీవనోపాధి కోసం ఆయన ఓ టీకొట్టు పెట్టారు. ఇంట్లో ప్రకాశరావు పెద్దవాడు కావడంతో తన తర్వాత ఉన్న ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడుని సాకేందుకు చిన్నప్పటి నుంచే ఆయన టీ కొట్లో పని చేసి అలా జీవితారంభం అయింది. అయితే తన జీవితంలో పడ్డ కష్టాలు ఒక సేవా మార్గంలో నడిపాయి. కటక్ లోని బక్సీ బజార్ ప్రాంతంలో ఆయన టీ స్టాల్ నడుపుతున్నారు. ఆ బస్తీలో ఉండేవాళ్లంతా పేదలే, తెలుగువాళ్ళే. అక్కడ పిల్లలు చదువకోవడానికి కనీసం స్కూల్ కూడా లేకపోవడంతో తన ఇంట్లోని రెండు గదుల్లో ఒక గదిని స్కూల్‌గా మార్చేశారు. రోజూ టీ, రొట్టెలు, వడలు విక్రయించగా వచ్చే రూ.600 ఆదాయంలో సగాన్ని పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం లేకపోయినా తన కుటుంబ ఖర్చులను తగ్గించుకొని మరీ ప్రకాశ్ రావు పిల్లలను చదివిస్తున్నారు.
మొదట్లో వారి తల్లిదండ్రుల నుంచి ప్రతిఘటన ఎదురైనా చదువు ప్రాధాన్యాన్ని వారికి వివరించి నచ్చజెప్పాడు. తన ఇద్దరు కూతుళ్లను చదివించి వారికి మంచి జీవితాన్ని అందించిన ఈయన తన బస్తీలోని పిల్లల బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. వారికి చదువు చెబుతూ ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్ ఇస్తు వారికి భోజనం కూడా పెడుతున్నారు. పిల్లలను చదివించడమే కాదు. ప్రకాశ్ రావు రక్తదానం చేసి ఎందరో జీవితాలను కాపాడారు. 40 ఏళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరగ్గా రక్తం అవసరమైంది. ఎవరో ఒకాయన వచ్చి రక్తం ఇచ్చి వెళ్లిపోయారట. తాను బతికి ఉన్నానంటే రక్తదానమే కారణమని నమ్మే ఆయన ఎవరికి రక్తం అవసరమైనా వెంటనే వెళ్లి ఇచ్చి వస్తుంటారు. నలభై ఏళ్లలో ఇప్పటి వరకూ 200సార్లకుపైగా రక్తదానం చేసి ఆసియా ఖండమ్ లోనే అత్యధిక రక్త దానం చేసిన వ్యక్తిగా రికార్డులకి ఎక్కారు. రోజూ హాస్పిటల్‌కు వెళ్లి పేద రోగులకు తోచిన సాయం చేస్తుంటారు. దశాబ్దాలుగా ఆయన ఆసుపత్రికి వచ్చిన రోగుల కోసం పాలు, నీరు కాచి అందిస్తున్నారు. ప్రకాశ్ రావు గురించి ఆ నోటా ఈ నోట తెలియడంతో ఒడిశా మొత్తం ఆయన పేరు మార్మోగింది. హ్యూమన్ రైట్స్ అవార్డ్, అనిబిసెంట్ అవార్డ్ సహా పలు పురస్కారాలు ఆయనకు దక్కాయి. ప్రకాశ్ రావు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓసారి కటక్ వెళ్లినప్పుడు ఆయన్ను కలిసి అభినందించారు. ఇక ఇప్పుడు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీ లభించింది.