Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే…ఈ నెల 30న రాహుల్ సోనియాగాంధీ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్నారు. గుజరాత్ లో ఎన్నికలు జరిగేనాటికి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటారు. అధ్యక్ష హోదాలో మోడీ సొంతరాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలన్నది రాహుల్ గాంధీ లక్ష్యం. అందుకే గుజరాత్ లో గెలుపుకోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
తరచుగా గుజరాత్ లో పర్యటిస్తూ..మోడీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్విట్టర్ లోనూ మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ మోడీ పై చేస్తున్న విమర్శలన్నీ గుజరాత్ ను ఉద్దేశించే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం గుజరాత్ లో పర్యటించిన రాహుల్ ఓ బహిరంగ సభలో జీఎస్టీపై హాస్యాస్పద విమర్శ చేశారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించారు. దీనిపై అనేక విమర్శలు తలెత్తాయి. అయినా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. ట్విట్టర్ లోనూ ఇదే రీతిలో స్పందించారు. కాంగ్రెస్ జీఎస్టీ అంటే జెన్యూన్ సింపుల్ టాక్స్ అని, మోడీ జీఎస్టీ అంటే..గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ట్వీట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. దేవుడా..రాహుల్ గాంధీకి కాస్త మంచి బుద్ధి ప్రసాదించు అని చురకలంటించారు. మోడీ ఆర్థిక విధానాలను దేశ ప్రజలు ఆమోదించారని ధర్మేంద్ర తెలిపారు.