చేతులు కాలాక‌….

Suniel to Act in NTR 28th film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో హాస్య‌న‌టుల‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్నించీ తెలుగులో క‌మెడియ‌న్స్ కు మంచి గుర్తింపు, ఆద‌ర‌ణా ఉన్నాయి. మొద‌టిత‌రం హాస్య‌న‌టులు రేలంగి, ర‌మణారెడ్డి వంటివారు త‌మ‌కే సొంత‌మైన మేన‌రిజ‌మ్స్ తో హాస్యం పండించి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు. అయితే ఎన్ని సినిమాల్లో న‌టించి ఎంత గుర్తింపు తెచ్చుకున్నా…వారు హాస్య‌పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప‌..హీరోలుగా మారాల‌ని భావించ‌లేదు. కెరీర్ సాగినంత‌కాలం క‌మెడియ‌న్స్ గానే కొన‌సాగారు. వారి త‌రానికే చెందిన ప‌ద్మ‌నాభం హాస్య ప్ర‌ధాన‌మైన చిత్రాల్లో హీరోగా చేసి చేతులు కాల్చుకున్నార‌ని అప్ప‌టిత‌రం వారు చెబుతుంటారు. వారి త‌ర్వాత త‌రంలో రాజ‌బాబు…కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్ గా మారారు. హాస్యానికి స్టార్ డ‌మ్ తెచ్చిన హాస్య‌న‌టుడు రాజ‌బాబు అని చెప్పొచ్చు. సినిమా పోస్ట‌ర్ పై రాజ‌బాబు బొమ్మ చూసి సినిమాకు వెళ్లిన అభిమానులు ఆయ‌న సొంతం. అయితే రాజ‌బాబు కూడా క‌మెడియ‌న్ గానే కొన‌సాగారు. ఆయ‌న హీరోగా కొన్ని సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ…అవ‌న్నీ కామెడీ చిత్రాలే. 70వ ద‌శ‌కం త‌ర్వాత‌…కామెడీకి తెలుగులో మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింది. 80వ‌ ద‌శకం నాటికి కామెడీ లేక‌పోతే సినిమాల‌కు ప్రేక్ష‌కులు రాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ స‌మ‌యంలోనే కామెడీకి హీరో ఇమేజ్ ద‌క్కింది. ఆ ఇమేజ్ వ‌ల్లే రాజేంద్ర‌ప్ర‌సాద్ హాస్య‌ చిత్రాల హీరోగా కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. అప్ప‌టిదాకా సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో క‌నిపించే కామెడీ కాస్త‌..

రాజేంద్ర‌ప్ర‌సాద్ రాక‌తో పూర్తిసినిమాగా మారింది. అదే స‌మ‌యంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ కామెడీ త‌ప్ప‌నిస‌రి అయింది. అందుకు త‌గ్గ‌ట్టుగా…సుత్తివేలు, సుత్తివీర‌భ‌ద్ర‌రావు, బ్ర‌హ్మానందం, బాబూ మోహ‌న్.. మ‌ల్లిఖార్జున‌రావు, సుధాక‌ర్, గుండు హ‌నుమంతురావు, ఆలీ, వేణుమాధ‌వ్ వంటి వారికి టాలీవుడ్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. బ్ర‌హ్మానందాన్ని టాలీవుడ్ కామెడీ చ‌రిత్ర‌లో కింగ్ అని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం బ్ర‌హ్మానందం ఇమేజ్ తో సినిమాలు ఆడిన సంద‌ర్భాలు ఉన్నాయి. 25 ఏళ్ల‌కు పైగా బ్ర‌హ్మ‌నందం తెలుగు కామెడీపై త‌న‌దైన ముద్ర‌వేశారు. క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపు వ‌చ్చిన త‌ర్వాత బ్ర‌హ్మానందం కూడా హీరోగా మారే ప్ర‌య‌త్నం చేశారు. నిర్మాత‌ల ఒత్తిడి మేర‌కో, లేక త‌న‌కు ఆసక్తి ఉండి చేశారో తెలియ‌దు కానీ…బాబాయ్ హోట‌ల్ వంటి కొన్ని హాస్య భ‌రిత చిత్రాల్లో హీరోగా న‌టించారు. అవి ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోవ‌డంతో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి క‌మెడియ‌న్ గానే కొన‌సాగారు. బ్ర‌హ్మానందంలానే ఆలీ కూడా కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా…క‌మెడియ‌న్ అవ‌కాశాల‌ను మాత్రం వ‌దులుకోలేదు. అందుకే వాళ్ల కెరీర్ సుదీర్ఘంగా సాగింది. కానీ త‌ర్వాత తరానికి చెందిన హాస్య‌న‌టుడు సునీల్ మాత్రం త‌న పొర‌పాట్ల‌తో తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ గా ఎదిగే అవ‌కాశాన్ని పోగొట్టుకున్నారు. బ్ర‌హ్మానందం సీనియ‌ర్ కావ‌డంతో త‌రుణ్, ఉద‌య్ కిర‌ణ్ వంటి హీరోల సినిమాల్లో క‌మెడియ‌న్ గా సునీల్ కు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి.

చిరంజీవి, వెంక‌టేశ్ వంటి అగ్ర‌హీరోల సినిమాల్లోనూ సునీల్ క‌మెడియ‌న్ గా న‌టించి మంచి గుర్తింపు పొందారు. ఒక ద‌శ‌లో ప్ర‌తి సినిమాలోనూ సునీలే క‌నిపించారు. అయితే బ్ర‌హ్మానందం, ఆలీ వంటి క‌మెడియ‌న్ల‌కు వ‌చ్చిన‌ట్టుగానే..సునీల్ కు కూడా హీరోగా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అందాల‌రాముడు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి చిత్రాల్లో హీరోగా న‌టించ‌డం…అవి చెప్పుకోత‌గ్గ విజ‌యాలు న‌మోదుచేసుకోవ‌డంతో పూర్తిస్థాయి హీరోగా మారేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో కామెడీ ఛాన్స్ ల‌ను వ‌దిలేసుకున్నారు. నిజానికి కొన్ని చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో….కామెడీ హీరోగా రాజేంద్ర‌ప్ర‌సాద్ ట్రెండ్ ను కొన‌సాగిస్తున్న అల్ల‌రి న‌రేశ్ కు సునీల్ ఒక ద‌శ‌లో తీవ్ర పోటీనిచ్చారు. కానీ..త‌ర్వాత కాలంలో సునీల్ కు వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌య్యాయి. దీంతో హీరోగా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అదే స‌మ‌యంలో ఇత‌ర క‌మెడియ‌న్ల‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌డంతో…ఆయ‌న‌కు క‌మెడియ‌న్ గానూ అవ‌కాశాలు రావ‌డం లేదు. అటు హీరో అవ‌కాశాలు రాక‌, ఇటు క‌మెడియ‌న్ ఛాన్సులూ లేక‌పోవ‌డంతో రెండింటికీ చెడ్డ రేవ‌డిలా అయింది సునీల్ ప‌రిస్థితి. విష‌యాన్ని గ్ర‌హించిన సునీల్ ఇటీవ‌లే తిరిగి కామెడీ క్యారెక్ట‌ర్లు చేసేందుకు సిద్ధం అని ప్ర‌క‌టించినా..ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు. ఈ త‌రుణంలో ఆయ‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్… సునీల్ కు అవ‌కాశం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు.

సినిమాల్లోకి రాక‌ముందు నుంచి త్రివిక్ర‌మ్, సునీల్ మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ 28వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న త్రివిక్ర‌మ్..ఆ సినిమాలో సునీల్ ను ఓ ముఖ్య‌మైన పాత్ర‌కు ఎంపిక‌చేసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి సునీల్ అందాల రాముడితో హీరోగా మారుతున్న స‌మ‌యంలో ఆ క్యారెక్ట‌ర్ చేయ‌వ‌ద్ద‌ని ఓ స్నేహితుడిగా త్రివిక్ర‌మ్ స‌ల‌హా ఇచ్చారు.. కానీ సునీల్ అప్పుడు దాన్ని పెడ‌చెవిన పెట్టారు. అయినా స‌రే ఇప్పుడు మిత్రుడు క‌ష్ట‌కాలంలో ఉండ‌డంతో త్రివిక్ర‌మ్ త‌న సినిమాలో అవ‌కాశ‌మిస్తూ..నిజ‌మైన స్నేహితుడు అనిపించుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత అయినా…త‌న కెరీర్ గాడిన ప‌డి…క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానో, క‌మెడియ‌న్ గానో స్థిర‌ప‌డాల‌ని సునీల్ భావిస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ 28వ సినిమా సునీల్ ను టాలీవుడ్ లో నిల‌బెడుతుందో లేదో చూడాలి.ఇప్ప‌టికే కొంద‌రు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా సునీల్ ప‌రిస్థితి ఉంద‌ని విమ‌ర్శిస్తున్నారు.