సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా కొందరు పెద్ద నిర్మాతలు టెక్నీషియన్స్‌కు పారితోషికం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ‘రంగస్థలం’ చిత్రం విషయంలో అదే జరుగుతుంది. దాదాపు 125 కోట్లు వసూళ్లు చేసిన ‘రంగస్థలం’ చిత్రంలో ఐటెం సాంగ్ జిగేల్ రాణి ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాట పాడిన సింగర్ వెంకటలక్ష్మికి పారితోషికం విషయంలో అన్యాయం జరిగిందట.
సింగర్స్ పారితోషికం విషయం పూర్తి బాధ్యత సంగీత దర్శకుడిది ఉంటుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అయినా కూడా ఐటెం సాంగ్ పాడిన వెంకటలక్ష్మికి కనీసం లక్ష రూపాయల పారితోషికం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. పాట పాడిన సమయంలో 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదని, సినిమా విడుదలై పాట సక్సెస్ అయితే మంచి పారితోషికంతో పాటు, మరిన్ని ఆఫర్లు ఇస్తాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ హామీ ఇచ్చాడట. కాని పాటకు మాత్రం పారితోషికం ఇవ్వలేదు.
దేవిశ్రీ ప్రసాద్ మరియు సుకుమార్‌లు ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఒక సింగర్‌కు అది కూడా ఒక పేద గ్రామీణ మహిళకు ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో ఇలా వ్యవహరించడం దారుణం అని, వెంటనే నిర్మాతలు స్పందించి అయినా ఆమెకు సరైన పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఆమె పారితోషికం ఇచ్చి గౌరవం నిలుపుకుంటారో లేదంటే ఆమె ముందు చిన్నబోతారో చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకోవాలి.