వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేసారు. జగన్ కి సీఎం కావాలన్న పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవని, వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.1,590 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. గతంలో పదవుల్లో ఉన్న వారు ఉత్తరాంధ్రకు ఏం చేశారని దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.
అప్పట్లో ప్రాజెక్టుల పేరుతో డబ్బులు కాజేసేందుకే ప్రయత్నించారని, పదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో నీళ్లు ఇచ్చామని, ఇప్పుడు తాటిపూడి ప్రాజెక్టులో సెల్ఫీలు తీసుకున్న నేతలు తమని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ నెల 11 తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించేందుకు వస్తారని అన్నారు. అలాగే ఇప్పటి వరకు పోలవరం పనులు 56 శాతం వరకు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు.