టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఈరోజుతో సరిగ్గా ఏడాది. గతేడాది ఆగస్టు 15న రాత్రి 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాజాగా ధోని రిటైర్మెంట్ మరోసారి వైరల్‌గా మారింది. ” కాలం ఎంత వేగంగా పరిగెత్తింది.. మా ధోని ఆటకు గుడ్‌బై చెప్పి అప్పుడే ఏడాది గడిచిపోయిందా” అంటూ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు.
2004లో భారత జట్టులోకి అరంగేట్రం ఇచ్చిన ధోనీ.. 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ.. కెప్టెన్‌గానూ సూపర్ సక్సెస్ సాధించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
ప్రస్తుతం ఎంఎస్ ధోని ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె మ్యాచ్‌లను ఆడేందుకు యూఏఈకి వెళ్లాడు. కాగా కరోనాకు ముందు జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడే సమయానికి చెన్నై పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరి మహేంద్రుడు మరోసారి సీఎస్కేను విజేతగా నిలుపుతాడేమో చూడాలి.