చాలామంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి అవి రెండు చాలా తేడాతో ఉన్న వేర్వేరు గుండె జబ్బులు. గుండె కండరాలకి రక్తాన్ని పంపే ధమనిలో ఏదైనా అడ్డు వచ్చి, గుండెకి సమయానికి రక్తం పంపింగ్ జరగక పోతే గుండెపోటు వస్తుంది, దీనివల్ల కొన్ని ముఖ్య భాగాలలో కణజాలాలు చచ్చిపోతాయి. అదే మరోవైపు, హఠాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ లో గుండె పనితీరు మొత్తం మీద అస్తవ్యస్తంగా అయి, గుండె కొట్టుకోవటం ఊహించనివిధంగా అమాంతం ఆగిపోతుంది. గుండెపోట్లకి అసలు కారణం కరోనరీ ఆర్టరీకి వచ్చే వ్యాధి. కరోనరీ ఆర్టరీ వ్యాధిలో, మీ గుండెలో ఉండే కరోనరీ ధమనులు ఎంతో కాలంగా పేరుకుపోతున్న కొవ్వు, కొలెస్టెరాల్ కారణంగా ఇరుకుగా మారిపోతాయి. ఈ పేరుకుపోయిన కొవ్వు మీద కణాలు ఒక టోపీలాగా దాన్ని కవర్ చేస్తాయి, అది మరీ పెద్దగా అయినప్పుడు రక్తప్రవాహంతో వచ్చే వత్తిడి వల్ల దానిపై రంధ్రం పడుతుంది. ఈ రంధ్రాన్ని పూడ్చటానికి ప్లేట్లెట్లు, గడ్డకట్టించే కణాలు అక్కడకి చేరి, అక్కడి రక్తం గడ్డకడుతూ పోతుంది. దీనివలన రక్తనాళం మరింత ఇరుకుగా మూసుకుపోతుంది.
కార్డియాక్ అరెస్ట్ హఠాత్తుగా నాడీ వ్యవస్థలో లోపాల వల్ల గుండె కొట్టుకోకపోతే వస్తుంది. దీనివలన శరీరంలో ముఖ్యభాగాలైన మెదడు వంటివాటికి రక్తం సరఫరా జరగక స్పృహ కోల్పోవటం, నాడీ అందకపోవటం జరుగుతాయి. ఇది గుండె కండరాల ఎదుగుదలలో లోపాలైన వెంట్రిక్యులార్ ఫైబ్రిలేషన్, కార్డియాక్ మయోపతి, వాల్వులార్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ వంటి వాటి వలన వస్తుంది.
హఠాత్తుగా వచ్చే కార్డియాక్ అరెస్ట్ వైద్యపరంగా ఒక అత్యవసర స్థితి, దీనికి వెంటనే సిపిఆర్ లేదా ఎలక్ట్రికల్ డీఫైబ్రిలేషన్ చేయటం అవసరం. ఇవి చేయలేకపోతే కార్డియాక్ అరెస్ట్ ప్రాణాంతకమవుతుంది. గుండెపోటు ఎక్కువసేపు ఉంటే గుండెలోని ముఖ్యభాగాలలో కండరాలు చచ్చిపోవటం వల్ల అది కార్డియాక్ అరెస్ట్ కి దారితీయవచ్చు. ఇదొక్కటే ఈ రెండు స్థితుల మధ్య లింక్ గా చెప్పుకోవచ్చు. అంతే కానీ రెండూ ఒకటి మాత్రం కాదు. గుండెపోటు కలిగించే ఏ స్థితులైనా కార్డియాక్ అరెస్ట్ రిస్క్ ను కూడా పెంచుతాయి, కానీ కార్డియాక్ అరెస్ట్ గుండెపోటుతో సంబంధం లేకుండా కూడా నేరుగా రావచ్చు.