లాక్ డౌన్ వేళ ఆహార పొట్లాల పంపిణీలో తేడా.. టెన్త్ స్టూడెంట్ దారుణ హత్య

కొమరం భీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పదో తరగతి విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. పేదలకు ఆహార పొట్లాలు పంపేందుకు డబ్బులు సేకరించే విషయంలో తలెత్తిన వివాదమే అందుకు కారణంగా తెలుస్కోంది. అయితే పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని ఆ విద్యార్థి కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. స్నేహితుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. అయితే కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్‌(టి)కి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు(16) కాగజ్‌నగర్‌ సర్దార్‌బస్తీలోని నాయనమ్మ వద్దే ఉంటూ ఈ మధ్యనే పదో తరగతి పరీక్షలు కొన్ని రాశాడు. కొన్ని ఇంకా జరగాల్సి ఉంది. కరోనా కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.

లాక్‌డౌన్‌ సమయంలో ఆ బస్తీలోని యువకులంతా పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ విద్యార్థి, అదే కాలనీ యువకుడు ప్రవీణ్‌ మంచి స్నేహితులు. తాజాగా అన్నదానానికి డబ్బుల పోగుచేసే విషయంలో ఇద్దిరి మధ్య గొడవ రాజుకుంది. ఆ విద్యార్థి అందరి ముందు ప్రవీణ్‌పై చేయి చేసుకున్నాడు. కోపంతో ప్రవీణ్‌ రాత్రి సమయంలో వెంట కత్తి తెచ్చుకొని ఆ విద్యార్థితో గొడవపడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా అదే రాత్రి నాన్నమ్మ తన మనవడు ఇంటికి రాలేదంటూ వీధుల్లో వెతుకుతుండగా రక్తపు మడుగులో కనిపించడంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు.. 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

దీంతో కుటుంబసభ్యుల గుండెలు అవిసేలా శోకించారు. అక్కడి వాతావరణం అంతా విషాద చాయలు అలముకున్నాయి. తన మనవడిని ఫోన్‌ చేసి పిలిపించి మరీ హత్య చేశారంటూ నాయనమ్మ రోదిస్తోన్న తీరు గుండెలను పిండేస్తుంది. చేతికొచ్చిన కొడుకు ప్రయోజకుడై వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడనుకున్నామని.. కానీ ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. కాగా ఘటనా స్థలాన్ని డీఎస్పీ స్వామి, టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ డి.మోహన్‌, ఎస్‌ఐ తహసీయోద్దీన్‌ పరిశీలించారు. కాగా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.