దిల్‌రాజు కూడా వారసుడిని తీసుకు వస్తున్నాడు

dil raju Brother son Ashish Reddy tollywood entry

తెలుగు సినిమా పరిశ్రమకు నెలకో వారసుడు చొప్పున ఎంట్రీ ఇస్తూనే వస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా పలువురు ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు కూడా తమ వారసులను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా తన వారసుడిని హీరోగా తీసుకు వచ్చేందుకు కథను సిద్దం చేయిస్తున్నాడు. దిల్‌రాజు తమ్ముడు శిరీష్‌ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎంతో మంది హీరోలను తన బ్యానర్‌లో పరిచయం చేసిన దిల్‌రాజు, ఎంతో మంది హీరోలకు తన నిర్మాణంలో సక్సెస్‌లను ఇచ్చాడు. ఇప్పుడు తన తమ్ముడి కొడుకును తన వారసుడిగా హీరోగా పరిచయం చేసేందుకు పక్కా ప్రణాళికతో సిద్దం అవుతున్నాడు. భారీ ఎత్తున కాకుండా ఒక మీడియం బడ్జెట్‌తో మంచి దర్శకుడితో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్‌రాజు సన్నాహం చేస్తున్నాడు. ఇక దిల్‌రాజు ఇప్పటికే తన వారసుడి సినిమా కోసం ‘పలుకే బంగారమాయేనా’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు. ఈ సంవత్సరంలో ప్రారంభించి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎంతో మంది వారసులు పరిచయం అవుతున్నా కూడా వారిలో సక్సెస్‌ అవుతున్నది తక్కువ మందే. మరి ఆశీష్‌ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.