దినేష్‌ ఆట తీరు ఎంతగానో ఆకట్టుకుంది

దినేష్‌ ఆట తీరు ఎంతగానో ఆకట్టుకుంది

భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య 2018 మార్చిలో జరిగిన నిదాహస్‌ ట్రోఫీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌ ఆడిన తీరు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 8 బంతుల్లో 29 పరుగులతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి కార్తీక్‌ కొట్టిన ఫ్లాట్‌ సిక్స్‌ ఇప్పటికీ మన కళ్లలో మెదులుతూనే ఉంటుంది.

దినేష్‌ కార్తీక్‌ కొట్టిన చివరి సిక్స్‌ మూమెంట్‌ అంతమనేది లేకుండా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ రూపంలో త్వరలోనే లభించనుంది. భారత్‌ను గెలిపించాక దినేష్‌ కార్తీక్‌ సెలబ్రెట్‌ చేసుకున్న విన్నింగ్‌ మూమెంట్‌ను యానిమేషన్‌ రూపంలో ఎన్‌ఎఫ్‌టీగా రానుంది. విన్నింగ్‌ పరుగులను సాధించినప్పుడు కార్తీక్‌లోని ఆలోచనలు, భావోద్వేగాలను ఈ ఎన్‌ఎఫ్‌టీ యానిమేషన్‌ రూపంలో పొందుపర్చనున్నారు.
చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..!

ఈ సందర్భంగా దినేష్‌ కార్తీక్ మాట్లాడుతూ…‘నిదాహస్‌ ట్రోఫి ఫైనాల్‌ నా జీవితంలో అత్యుత్తమ క్షణాల్లో అది ఒకటి. ఆ క్షణాలు ఇప్పుడు గ్రాఫికల్‌ ఎన్‌ఎఫ్‌టీ రూపంలో రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంద’ని అన్నారు. ఈ ఎన్‌ఎఫ్‌టీ ప్రాజెక్ట్‌ను కార్తీక్‌ సమీప బంధువు, అగ్రశ్రేణి స్క్వాష్‌ ప్లేయర్‌ సౌరవ్‌ ఘోషల్‌ సహకారంతో చేపట్టారు. దినేష్‌ కార్తీక్‌ ఎన్‌ఎఫ్‌టీ అక్టోబర్‌ 12 నుంచి వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్‌ మార్కెట్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్‌ కాయిన్‌, డిగో కాయిన్‌, ఈథర్‌నెట్‌ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు.

క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు.