Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2011 వరల్డ్ కప్ తర్వాత చివరిబాల్ కు సిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీనే. ముంబైలో వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ లో చివరి బంతిని సిక్సర్ గా మలిచి భారత్ కు ప్రపంచకప్ అందించిన ధోనీ చరిత్రలో నిలిచిపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత… అలాంటి అద్భుతం టీ 20లో చోటుచేసుకుంది. ఈ సారి దినేశ్ కార్తీక్ ఆ అద్భుతాన్ని ఆవిష్కరించి ధోనీ సరసన చేరాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతిని సిక్సర్ గా మలిచి దినేశ్ కార్తీక్ భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
నరాలు తెగే ఉత్కంఠ మధ్య దినేశ్ చివరి బంతికి సిక్స్ కొట్టిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దినేశ్ కార్తీక్ చివరి బంతికి కొట్టిన సిక్స్ చూశారా అంటూ ఆ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్నారు. దినేశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడుతున్నా రాని గుర్తింపు… దినేశ్ కార్తీక్ కు ఈ ఒక్క సిక్స్ ద్వారానే లభించింది. జట్టుకు ఎంపికైనా… తుది పదకొండుమందిలో చోటు దక్కించుకోక… ఎక్కువసార్లు బెంచ్ కే పరిమితమైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన దినేశ్ కార్తీక్ ఈ సిక్స్ తర్వాత ఒక్కసారిగా జాతీయస్థాయిలో హీరో అయ్యాడు.