Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగకుండానే భారత్ టీ ముక్కోణపు టోర్నీ కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించి భారత్ కప్ కైవసం చేసుకుంది. కొన్నేళ్లుగా క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎక్కువ మ్యాచ్ ల్లో భారత్ విజయలు సాధిస్తోంది. అవి కూడా ఏకపక్షంగా సాగుతున్నాయి. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్ మాత్రం అలా కాదు. చానాళ్ల తర్వాత భారత్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ ఆడి గుర్తుండిపోయే విజయాన్ని నమోదుచేసింది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ అయినప్పటికీ… కీలకఆటగాళ్లు దూరమవడంతో… భారత్ కూడా బలమైన జట్టుగా ఏమీ కనిపించలేదు. మ్యాచ్ కూడా ఇరుజట్ల మధ్య పోటాపోటీగా సాగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను ధావన్, రైనా నిరాశపరిచినప్పటికీ… కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణించాడు. రోహిత్ కు, కె.ఎల్. రాహుల్ తోడవడంతో భారత్ పదో ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటవడంతో భారత ఇన్నింగ్స్ గాడితప్పింది. వరుసగా వికెట్లు పడడంతో రన్ రేట్ పెరిగిపోయింది. 17 ఓవర్లకు భారత్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు. అంటే మూడు ఓవర్లలో 35పరుగులు చేయాల్సిన స్థితి. అప్పటికే మనీష్ పాండే క్రీజులో కుదురుకోవడంతో భారత ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఒక్క బంతికి ఒక్క పరుగు చేసినా మ్యాచ్ లో భారత్ గెలుపొందుతుంది. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. తన చివరి ఓవర్ బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ తొలి నాలుగు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ముస్తాఫిజుర్ బౌలింగ్ ను విజయ్ శంకర్ ఎదుర్కోలేకపోయాడు. ఐదో బంతికి మాత్రం సింగిల్ తీశాడు. ఆ సంతోషం నిలవకముందే ఓవర్ చివరి బంతికి పాండేను ఔట్ చేశాడు ముస్తాఫిజుర్. అంతే భారత్ శిబిరంలో నిశ్శబ్దం ఆవరించింది.
భారత్ ఇక ఓడిపోయినట్టేనని అంతా భావించారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. దినేశ్ కార్తీక్ క్రీజులో అడుగుపెట్టాడు. నిజానికి దినేశ్ గత రికార్డు దృష్ట్యా ఎవరికీ మ్యాచ్ పై ఆశలు లేవు. రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన మ్యాచ్ ను దినేశ్ గెలిపించగలడని భారతీయ అభిమానులు ఎవరికీ పెద్దగా నమ్మకంలేదు. కానీ దినేశ్ అంచనాలకు మించి రాణించాడు. అద్భుతం సృష్టించాడు. తొలిబంతినే సిక్సర్ గా మలిచాడు. అంతే అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న స్టేడియం హోరెత్తిపోయింది. అనంతరం రెండోబంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతిని మళ్లీ సిక్సర్ గా మలిచాడు. తొలి మూడు బంతుల్లో 16 పరుగులు వచ్చాయి. భారత్ కు గెలుపు ఆశలు కనిపించాయి. అయితే తర్వాత బంతికి దినేశ్ పరుగుచేయలేకపోయాడు. మళ్లీ అభిమానుల్లో ఆందోళన. తర్వాతి బంతికి రెండు పరుగులు చేసిన కార్తీక్ చివరి బంతిని మళ్లీ బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్లో 22 పరుగులు రావడంతో చివరి ఓవర్లో ఆరు బంతులకు పన్నెండు పరుగులు తీస్తే భారత్ గెలవగల స్థితి ఏర్పడింది.
దినేశ్ కార్తీక్ జోరు చూసి అందరూ భారత్ గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే స్ట్రయికింగ్ లో కార్తీక్ లేడు. శంకర్ స్ట్రయికింగ్ కావడంతో అందరిలో ఉత్కంఠ మొదలయింది. శంకర్ సింగిల్ తీయడంతో దినేశ్ కార్తీక్ స్ట్రైక్ వచ్చింది. అయితే దినేశ్ కార్తీక్ కూడా సింగిలే తీశాడు. నరాలు తెగే ఉత్కంఠ. తర్వాత బంతిని శంకర్ బౌండరీకి తరలించాడు. చివరికి భారత్ విజయం సాధించాలంటే ఒక్క బంతికి ఐదు పరుగులు చేయాలి. సిక్సర్ తప్పనిసరి. స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచినిల్చున్నారు. అందరూ ఊపిరిబిగపట్టి చూస్తుండగా… సౌమ్య సర్కార్ వేసిన ఆఖరి బంతిని దినేశ్ కార్తీక్ అమోఘమైనరీతిలో సిక్సర్ గా మలిచి… భారత్ కు చిరస్మరణీయ గెలుపు అందించాడు. కేవలం 8 బంతుల్లో 29పరుగులు చేసి… భారత్ ను ఓటమి నుంచి గెలుపు తీరాలకు చేర్చిన దినేశ్ కార్తీక్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అటు దినేశ్ పై మాజీ క్రీడాకారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.