తెలుగు లోగిళ్ల‌లో విళంబినామ ఉగాది వేడుక‌లు

Vilambi Nama Samvatsara Ugadi celebrations in Telugu States

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల ప్ర‌జలు విళంబినామ సంవ‌త్స‌రం ఉగాదిని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. తెలుగులోగిళ్లు ఉగాది ప‌ర్వ‌దిన వేడుక‌ల‌తో కొత్త అందం సంతరించుకున్నాయి. అంద‌రూ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఉత్సాహంగా పండుగ జ‌రుపుకుంటున్నారు. ఉదయాన్నే ఆల‌యాల‌కు త‌ర‌లివెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పంచాగ శ్ర‌వణాన్ని ఆస‌క్తిగా ఆల‌కించారు. తెలుగు నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌ముఖ దేవాల‌యాల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. భ‌క్తుల ర‌ద్దీ కార‌ణంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో ఈ ఉద‌యం ఆర్జిత సేవ‌లు ర‌ద్దుచేశారు. విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపారు. ఆల‌యాల‌న్నింటిలో ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపారు. ఉగాది ప‌ర్వ‌దినం నాడే బ్ర‌హ్మ‌దేవుడు మాన‌వ‌సృష్టి ప్రారంభించాడన్న‌ది హిందువుల న‌మ్మ‌కం. అందుకే ఈ రోజు ఇష్ట‌దైవాల‌ను కొలిచి, భ‌క్తులు త‌మ కోరిక‌లు విన్న‌వించుకుంటారు. ఇక ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తీపి, చేదు, పులుపు,కారం, వ‌గ‌రు, ఉప్పు…ఇలా ష‌డ్రుచులతో ఉండే పచ్చ‌డి..తీసుకోవ‌డం తెలుగువారి సంప్ర‌దాయం. ప‌ర‌గ‌డుపున ప‌చ్చ‌డినోట్లో వేసుకోగానే..ఏ రుచి ముందు నోటికి త‌గిలితే..ఆ ఏడాదంతా అలా ఉంటుంద‌ని న‌మ్మ‌కం. దీన్ని ప‌క్క‌న‌పెడితే వైద్య‌ప‌రంగా ఉగాది ప‌చ్చ‌డికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. రుతువుల మార్పు కార‌ణంగా ఈ స‌మ‌యంలో కొన్ని అనారోగ్యాలు క‌లుగుతాయి. వాత‌, పిత్త‌, క‌ఫ దోషాలుగా పిలిచే కొన్ని అనారోగ్యాల‌ను ఉగాది ప‌చ్చ‌డి త‌గ్గిస్తుంది. వేప‌పువ్వు, చింత‌పండు,కొత్త బెల్లం, ప‌చ్చి మిర‌ప‌, ప‌చ్చి మామిడి వంటివాటితో త‌యారుచేసే ప‌చ్చ‌డి ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే..అనారోగ్యం తొల‌గిపోతుంది.

అందుకే ప్ర‌జ‌లంతా ఈ రోజు త‌ప్ప‌నిస‌రిగా ఉగాది ప‌చ్చ‌డి ఆరగిస్తారు. రుచి, ఆరోగ్య‌మే కాదు…ఉగాది ప‌చ్చ‌డిలో నిగూఢార్ద‌మూ దాగిఉందంటున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి కళాక్షేత్రంలో జ‌రిగిన ఉగాది వేడుక‌ల్లో పాల్గొన్న చంద్ర‌బాబు…ఉగాది ప‌చ్చ‌డి ప్రాశ‌స్త్యాన్ని వివ‌రించారు. ఆరురుచుల్లోనే జీవిత‌సారం ఇమిడిఉంద‌ని, జీవితంలోని అనుభ‌వాల‌కు మ‌న‌సారా స్వాగ‌తం ప‌లికే స‌మ‌య‌మిద‌ని వ్యాఖ్యానించారు. చింత‌పండు పులుపుతో నేర్పుగా వ్య‌వ‌హ‌రించాల‌న్న సంకేతం ఉందని, ప‌చ్చి మామిడి రుచితో కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని, కారంతో స‌హ‌నంకోల్పోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాల‌ని సూచించారు. త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ క‌లిపిన ఉగాది ప‌చ్చ‌డినే తాను తొలుత తిన్నాన‌ని, ఆయ‌న చెప్పారు. ప‌చ్చ‌డిలోని వేప‌పువ్వు చేదు త‌న మ‌న‌వ‌డికి పెద్ద‌గా న‌చ్చిన‌ట్టు లేద‌ని, రెండుసార్లు తిని, ఇక స‌రిపోయింద‌ని చెప్పాడంటూ..ఉగాది సంద‌ర్భంగా మ‌న‌వ‌డి సంగ‌తులు పంచుకున్నారు చంద్ర‌బాబు.