క‌రోనా బారిన ప‌డ్డ లెజెండ‌రీ డైరెక్ట‌ర్

క‌రోనా బారిన ప‌డ్డ లెజెండ‌రీ డైరెక్ట‌ర్

టాలీవుడ్‌ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బుధ‌వారం ఫేస్‌బుక్‌ వీడియో ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేశారు. కోవిడ్‌-19 ల‌క్ష‌ణాల‌తో సెప్టెంబ‌ర్ 9న చెన్నైలో ప‌రీక్ష చేయించుకోగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం(సెప్టెంబ‌ర్ 22) నాటితో ఆయ‌న క్వారంటైన్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపారు. అయితే అంత‌కు ముందు రోజే ఆయ‌న పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.

త‌న‌కు క‌రోనా సోకిన విష‌యం గురించి ఆయ‌న మాట్లాడుతూ.. 65 ఏళ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్ట‌ర్లు ఇప్పుడు కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ అన్నారంటూ స‌రదాగా మాట్లాడారు. హోమ్ ఐసోలేష‌న్‌లో భాగంగా ప్ర‌త్యేక గ‌దిలో ఉన్నాన‌ని, ఇది త‌న‌కు హాస్ట‌ల్ రోజుల‌ను గుర్తు చేస్తోందంటూ చ‌మ‌త్క‌రించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్ర‌త్త‌లు ప‌డ్డా ఆ వైర‌స్ త‌న‌కు సోకింద‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపారు. కాగా సింగీతం శ్రీనివాస‌రావు ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘ఆదిత్య‌369’ వంటి ప‌లు హిట్ చిత్రాల‌కుదర్శకత్వం వహించారు. చివ‌రిసారిగా 2005లో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌” ముంబై ఎక్స్‌ప్రెస్” చిత్రానికి డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు.