ఫిదా, హ్యాపీ డేస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల అసిస్టెంటునని, కొత్త ముఖాలకోసం చూస్తున్న ఆయన తీసే కొత్త సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఇంటర్నెట్ లో వచ్చిన యాడ్ చూసి అనేక మంది ఆ మాయగాడి వలలో పడ్డారు. ‘నేను రూపొందిస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి’ అంటూ శేఖర్ కమ్ముల పేరుతో నెల క్రితం ట్విట్టర్ లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్ కమ్ముల రూపొందించే చిత్రాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమేనని నమ్మిన వందలాది మంది అందులోని నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి తాను శేఖర్ కమ్ముల బ్యానర్లో పనిచేస్తున్నానని చెప్పాడు. రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ముందుగా రూ.1,500-2 వేలు ఇవ్వాలని సూచించారు. ముందుగా డబ్బు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని, ఆపై ఈ నెల 25న తుది ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో ఉంటుందని నమ్మబలికాడు.
ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు. డబ్బు ఖాతాలో డిపాజిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయని సమాచారం ఇచ్చాడు. ఒంగోలుకు చెందిన ప్రదీప్ అనే యువకుడు 25న ఇంటర్వ్యూ ఉందనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు వచ్చి శేఖర్ కమ్ములను కలిశాడు. మిగితా డబ్బు చెల్లిస్తానని, ఇంటర్వ్యూ చేయాలని కోరాడు. ఆశ్చర్యపోయిన శేఖర్ కమ్ముల ఆ యువకుడి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. తాను ఆ పోస్ట్ పెట్టలేదని, ఎవరో మోసం చేశారని వివరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానంటూ ప్రదీప్‌ను వెంటబెట్టుకొని వచ్చి, సైబర్‌క్రైమ్స్ అదనపు డీసీపీ రఘువీర్‌కు ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఎవరూ అసిస్టెంట్ డైరక్టర్లు లేరని ఆయన స్పష్టం చేశారు.