రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ

గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఈ భరోసా కేంద్రాల్లోనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం అన్నారు. బుధవారం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. రాబోయే ఖరీఫ్‌ నాటికి 11, 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్‌షాపుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. రైతుల భరోసా పథకంను చెప్పిన దానికంటే ముందగానే అమలుచేశామని సీఎం స్పష్టం చేశారు.

సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… ‘వ్యవసాయంలో కీలక సంస్కరణలు తీసుకువస్తాం. దీనిలో భాగంగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. పశువులకు హెల్త్‌ కార్డులు, పంట భీమా కార్డులు ఇస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్‌పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తాం. అలాగే విత్తన పరీక్షలు కూడా చేసుకోవచ్చు. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసాను రూ.12500 నుంచి 13500కు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఇన్సురెన్స్‌ ప్రీమియం కింద రూ.2100 కోట్లను ప్రభుత్వం అదనంగా భరిస్తోంది. రైతుల కోసం వైఎస్సార్‌ వడ్డీలేని రుణాలను అందిస్తున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకువచ్చాం. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు రూ. 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించాం. రూ. 2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.’ అని అన్నారు.