మరో సారి రాష్ట్ర ఉద్యమం రాకుండా మూడు రాజధానులని.. అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు కానీ.. ఆ మూడు రాజధానుల వల్లే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. జగన్ ప్రత్యేక రాయలసీమకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశాడని.. రెండేళ్లకో, ఐదేళ్లకో వచ్చి తీరాల్సిందేనని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. కొద్ది రోజులుగా.. రాయలసీమలో రాజధానిపై మార్పుపై చర్చ జరుగుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయడం వల్ల ఓ సామాజికవర్గం నష్టపోతుందని.. అధికార పార్టీ నేతలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. తమకు దూరం చేయడం వల్ల తాము నష్టపోతున్నామన్న అంశం.. మెల్లగా చర్చల్లోకి వస్తోంది.
ఇదే విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డితో పాటు.. పలువురు నేతలు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల సమీపంలో ఉన్న వారు.. తమను ఆయా రాష్ట్రాల్లో కలపాలని కోరుతున్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన.. రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలు.. ఉంచితే అమరావతిని ఉంచాలి.. లేకపోతే.. ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. చిన్నరాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని… కేంద్రం, కోర్టులున్నాయని జేసీ చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం తీరుపై కేంద్రం వేచిచూసే ధోరణిలో ఉందని .. జగన్ అనుకున్నంత సులువుగా మూడు రాజధానులు ఏర్పడవని గుర్తు చేశారు. విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని.. హైకోర్టు వల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చేశారు. జిల్లాకో కియా లాంటి పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తే చాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. మొత్తానికి జేసీ.. రాయలసీమ ఉద్యమానికి జగనే.. ఊపిరి పోశాడని తేల్చేశారు