బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్‌లైక్ చేశారు.
ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్‌లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్‌లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్‌లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.