పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనను ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే అతడి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మధ్యలో దూరి ఆ ప్రతిపాదన భేష్ అంటూ ప్రెస్ నోట్ ఇవ్వడం పెద్ద షాకే. చిరంజీవి రాజకీయాలు వదిలి పెట్టి చాలా కాలమైంది. చివరగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన 2014 ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయిపోయారు.

ఎంపీగా తన పదవీ కాలం ముగిసేవరకైనా కాస్తో కూస్తో చురుగ్గా ఉన్నారు కానీ.. అది ముగియగానే పూర్తిగా రాజకీయాల్ని పక్కన పెట్టేశారు. తానొక రాజకీయ నాయకుడిని అనే సంకేతం కూడా జనాలకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఒకప్పటిలా సినీ నటుడిగానే తనను జనాలు గుర్తు పెట్టుకోవాలని ఆశించారు. ఏదైనా రాజకీయ అంశాలపై అభిప్రాయం అడిగినా చిరు మాట్లాడేవాడు కాదు. తన దృష్టంతా సినిమాలపైనే, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడేవాడు.

అలాంటివాడు ఇప్పుడు ఎవ్వరూ అడక్కుండానే ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై స్పందించి.. జగన్ ఆలోచనకు మద్దతు పలకాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది జనాలకు అర్థం కావడం లేదు. మీడియా వాళ్లను కలిసినపుడు వాళ్లు దీనిపై ప్రశ్నిస్తే అభిప్రాయం చెప్పినా ఒక రకంగా ఉండేది. కానీ అలా కాకుండా పనిగట్టుకుని తమ్ముడి ఆలోచనలకు భిన్నంగా తన అభిప్రాయం వెల్లడించడమే మెగా అభిమానులకు రుచించడం లేదు.