కృష్ణా జిలాలోని దివిసీమలో విషసర్పాల కాటునకు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల్లో కృష్ణా జిల్లాలో 74 మంది పాము కాటుకు గురయ్యారు. ఇప్పటి వరకు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రెండువందల పాము కాటు కేసులు నమోదవడంతో పాటు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు కనీసం ఐదు కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు 16 న కోడూరు మండలం విశ్వనాధపల్లెకి చెందిన ఓ వ్యక్తి పాము కాటుతో మరణించారు. శుక్రవారం సైతం పలువురు పాము కాటుకు గురవగా ఓ వ్యక్తి మరణించాడు.
ఇలా రోజూ అనేక మంది పాము కాటుకు గురికావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో దివిసీమవాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంపై పాములు పగబట్టాయని అందుకే ఇలా కాటు వేసి జనాన్ని భయపెడుతున్నాయని నమ్ముతున్న దివిసీమ వాసులు, ఆగస్టు 29 న భారీ స్థాయిలో సర్పహోమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ హోమం తరువాత పాములు శాంతిస్తాయని, ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొంటారని అక్కడి వారు చెబుతున్నారు.