విడాకుల కోసం వెళ్ళి మళ్ళీ పెళ్లి

విడాకుల కోసం వెళ్ళి మళ్ళీ పెళ్లి

మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టుకెక్కిన రెండు జంటలకు.. న్యాయమూర్తులు సర్దిచెప్పి వారు కలిసి జీవించేలా చేసిన అరుదైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. విడాకులు కోరడం వెనకున్న కారణాలు తెలుసుకుని వారిద్దరికీ కోర్టులో మళ్లీ పెళ్లి జరిపించి మనస్పర్థలను న్యాయమూర్తులు పటాపంచలు చేశారు. ఒడిశాలోని జయపురం బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి, అనితలకు 2016లో వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వీరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగింది.

అయితే, ఆ తర్వాత వీరిమధ్య కలతలు మొదలయ్యాయి. దీంతో ఇక కలిసుండటం కుదరదని భావించి దంపతులు 2018లో విడాకుల కోసం కోర్టుకెక్కారు. వారికి అప్పటికే ఏడాది వయసున్న పాప ఉంది. విడాకుల కేసు విచారణ జరుగుతుండగా.. నిన్న జయపురం కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌లో కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు వాదించిన న్యాయవాది మున్నాసింగ్ వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని వివరించారు. మనస్పర్థల కారణంగా దూరమైన వారిని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ ఒప్పంచి అక్కడే వారిద్దరికీ వివాహం జరిపించి విడిపోవాల్సిన జంటను ఒక్కటి చేశారు.

అలాగే, జగత్సింగ్‌పూర్ జిల్లా పలాసోలా చెందిన ఓ జంట విడాకుల కేసులోనూ న్యాయమూర్తులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక్కటిగా చేశారు. ఆదివారం కటక్ జేఎంఎఫ్‌సీ రూరల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలాసోలా గ్రామానికి చెందిన గగన్ బిహారి బిస్వాల్ విడాకుల కేసు విచారణకు వచ్చింది. గగన్ బిహార్ బిస్వాల్‌కు 2015లో ప్రమోదిని ప్రధాన్‌తో వివాహం జరిగింది. రెండేళ్లు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాత గొడవలు ప్రారంభం కావడంతో 2017 నుంచి విడివిడిగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో భార్య ప్రమోదిని విడాకుల కోసం కటక్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. న్యాయస్థానం విడాకుల మంజూరుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆదివారం జరిగిన లోక్ అదాలత్‌కు కేసు విచారణకు రాగా.. న్యాయమూర్తులు ఈ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ప్రభుత్వ న్యాయవాది డీ అనూప్ మీడియాతో మాట్లాడుతూ.. భార్యభర్తలు ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేశారు.. కానీ, న్యాయమూర్తులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో కలిసి బతకడానికి అంగీకరించారన్నారు. వివాదాలను పక్కనబెట్టి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. న్యాయమూర్తులు ఎస్డీజేఎం విద్యుత్ కుమార్ మిశ్రా, జేఎంఎఫ్‌సీ రూరల్ మనోజ్ కుమార్ మహంతి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు స్వయంప్రభ ఆచార్య, పిటిషనర్ల తరఫున లాయర్లు తదితరులు విచారణ సందర్భంగా హాజరయ్యారని పేర్కొన్నారు.