Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పుట్టా సుధాకర్ యాదవ్… ఈ పేరు కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు చిరపరిచితం. క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన ఈయన టీడీపీ అగ్రనేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కూడా. మైదుకూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్. కిందటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో సుధాకర్ యాదవ్ ఓటమి చవిచూశారు. రఘురామిరెడ్డి తో ఆది నుంచి రాజకీయ వైరం వున్న డీ. ఎల్. రవీంద్ర రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ కి పరోక్షంగా మద్దతు ఇచ్చారని నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అయినా గెలుపు దక్కలేదు. అయినప్పటికీ టీడీపీ సర్కార్ రావడంతో నియోజకవర్గంలో ఇతని మాటకు విలువ పెరిగింది.
హైకమాండ్ లో యనమలకి వున్న విలువ, టీడీపీ కి అధికారం అనే రెండు అస్త్రాలు ఉండటంతో 2014 ఎన్నికల్లో తనకు సాయం చేసిన రవీంద్రా రెడ్డి వర్గాన్ని కూడా యాదవ్ నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అక్కడే సీన్ మారిపోయింది. నిన్నమొన్నటిదాకా వైసీపీ వైపు చూసిన రవీంద్రా రెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకున్నారన్న వార్త బయటికి వచ్చింది. దీంతో ఆయన టీడీపీ లో చేరుతారనే ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. దీంతో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వున్న సుధాకర్ యాదవ్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ జరిపిన వివిధ సర్వేల్లో సుధాకర్ యాదవ్ కి అనుకూలంగా పరిస్థితులు లేవని తెలియడంతో టీడీపీ అధిష్టానం కూడా డీఎల్ వైపు మొగ్గు చూపిస్తోందట. త్వరలో జరిగే ఓ వివాహ కార్యక్రమ సందర్భంగా డీఎల్, చంద్రబాబు ఈ విషయం మీద ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందట. అయితే ఇవన్నీ ఇప్పుడే ఎవరూ నిర్ధారించలేని పరిస్థితి. కానీ తగలవలసిన వారికి సెగ బాగానే తగిలింది. అందుకే ఎవరూ అడగకపోయినా నేనే మైదుకూరు ఇన్ ఛార్జ్, నాకే వచ్చే ఎన్నికల్లో సీట్ అంటూ సుధాకర్ చెప్పేస్తున్నారు. ఆయన మాటలు చూసాకే చాలా మంది డీఎల్ టీడీపీ లోకి రావడం ఖాయం అని ఫిక్స్ అవుతున్నారట. పుట్టా వైఖరితో విసిగిపోయిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు అయితే ఇప్పటికే డీఎల్ కంటిలో పడే ప్రయత్నాలు మొదలు పెట్టారట.