జయలలిత మరణం దగ్గరనుంచి రోజుకో మలుపు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురైన శశికళ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న దినకరన్ కు తమిళనాడు స్పీకర్ షాకిచ్చారు. పార్టీ విప్ ధిక్కరించారన్న కారణంతో దినకరన్ కు మద్దతు పలుకుతున్న 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టి .. ముఖ్యమంత్రి పళనిస్వామిని పదవి నుంచి దింపేస్తానని కొంతకాలంగా దినకరన్ ప్రకటనలు చేస్తున్నారు.
పళనిస్వామి బలనిరూపణకు ఆదేశించాలని కోరుతూ దినకరన్ వర్గం మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించింది. విపక్షాలు కూడా ఈ విషయంపై పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ బలనిరూపణకు ఆదేశిస్తే ఇరకాటంలో పడతామని భావిస్తున్న పళనిస్వామి వర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపి… తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం ప్రయోగించింది. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై వస్తున్న నేపథ్యంలో ఈ అనర్హత వేటు పడటం గమనార్హం. తాజా నిర్ణయంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 నుంచి 215కు చేరింది. ఇప్పుడు గనక గవర్నర్ బలనిరూపణకు ఆదేశిస్తే..పళనిస్వామికి 107 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. మరోవైపు స్పీకర్ నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని వారు తెలిపారు.