టిటిడి పాలకమండలి…వారికి పదవులు దక్కేనా ?

టిటిడి పాలకమండలి...వారికి పదవులు దక్కేనా ?

టిటిడి పాలకమండలి నియమాకానికి లైన్ క్లియర్ అయ్యింది. 25 మంది సభ్యుల పాలకమండలికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌కు ఇవాళ గవర్నర్‌ ఆమోదం తెలపడమే ఆలస్యం… కొత్త పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది.  ఇప్పటివరకు ఛైర్మన్‌ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది వరకు పాలకమండలి సభ్యులను నియమించవచ్చు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరితో పాటు నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉంటారు. ఇప్పటికే టిటిడి చైర్మైన్ గా వైవి సుబ్బారెడ్డి, ఎక్స్ అఫిషియోసభ్యుడి హోదాలో తుడా చైర్మైన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకం జరిగాయి. టీటీడీ ఇఓ, ఎండోమెంట్ కమిషనర్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరిలు ఎక్స్ అపిషియో సభ్యుల హోదాలో పాలకమండలిలో కొనసాగుతారు.

కొత్త నిర్ణయం ప్రకారం ఇంకా 20 మంది సభ్యులును ప్రభుత్వం నియమించాల్సి ఉంది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దేవాదాయ చట్టం ప్రకారం పాలకమండలిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక్క ఎస్సీ, ఒక్క మహిళను నియమించడం తప్పనిసరి. దీంతో ఎమ్మెల్యే కోటాలో యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు పేర్లు ఖరారైనట్లు సమాచారం. ఇక మహిళ కోటాలో వైసీపీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కోటాలో కృష్ణమూర్తి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, తెలంగాణ కోటాలో మైహోం అధినేత రామేశ్వరరావు, విశాఖ శారదాపీఠాధిపతి శిష్యుడు సుబ్బారావు పేర్లు ఖరారైనట్లు సమాచారం. టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం కేంద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వుండటంతో కొత్త ముఖాలకు చోటు లభించనుంది.