జగన్ ని ఇమిటేట్ చేసి…జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మీద లోకేష్ కామెంట్స్

జగన్ ని ఇమిటేట్ చేసి...జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మీద లోకేష్ కామెంట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్రెండ్ మార్చారు. వైసీపీ ప్రభుత్వం పనితీరుపై నిశితమైన విమర్శలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖజిల్లా నర్సీపట్నంలో లోకేష్  టూర్ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గోన్నారు. నర్సీపట్టణం శ్రీకన్యథియేటర్ దగ్గర నుంచి  ఏర్పాటు చేసిన భారీ ప్రభుత్వ వ్యతిరేక బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గోన్నారు. అయితే హెల్మెట్లు లేకపోతే ర్యాలీకి అనుమతించమని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వినూత్న నిరసన చేపట్టారు. బైక్ లు  తోసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా ఎన్టీఆర్ ఆసుపత్రి వరకూ వెళ్ళారు.

అక్కడ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తర్వాత జరిగిన కార్యకర్తల సభలో లోకేష్ ముఖ్యమంత్రి హావభావాలను అనుకరిస్తూ ప్రసంగించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఎన్నికలు ముందు ముద్దులు పెట్టిన జగన్….ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారన్నారు. టీడీపీ టార్గెట్ గా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని.. కార్యకర్తలకు అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఐదేళ్లు అహర్నిశలు కష్ట పడ్డారన్న లోకేష్….జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి ఇప్పుడు ఎడారిలా మారిందన్నారు. సభ  ముగిసిన తర్వాత మూసివేసిన అన్న క్యాంటీన్ పరిశీలించారు లోకేష్.పేదల కోసం టీడీపీ నాయకత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రంలో పేదలకు భోజనం వడ్డించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావడంపై లోకేష్ నేరుగా స్పందించలేదు కానీ తమ సేనాధిపతి చంద్రబాబు నాయకత్వంలో తామంతా  సైనికులమేనన్నారు. పార్టీ అభివృద్ధిని కాక్షించే ఎవరైనా క్రియాశీలకంగా మారవొచ్చని సూచించారు. అలాగే, చంద్రబాబు ఇల్లు సహా టీడీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు అన్నీ సక్రమంగానే జరిగాయని లోకేష్ స్పష్టం  చేశారు.