ఆది మనసు మార్చుకున్నారా ?

ఆది మనసు మార్చుకున్నారా ?

బిజెపి గూటికి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్న టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. తాజాగా ఆయన టిడిపి అధినేతతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఆదినారాయణరెడ్డి పార్టీ వీడే ఆలోచనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి అనుమానాలు, అవసరాలు తెలుసుకున్న చంద్రబాబు ఆమేరకు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి జాతీయ అద్యక్షుడు నడ్డాను సైతం కలిసిన ఆది… ఢిల్లీ ఫ్లైటెక్కబోయి ఆగిపోయారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలో ఉండలేనని భావించిన ఆది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు చూశారు. వాస్తవంగా బిజెపి తనకు అంత సూట్ కాదని తెలిసినా ఆ వైపుగా అడుగులు వేశారు. అయితే కడప జిల్లా పార్టీ అధ్యక్షుడితో ఫోన్ చేయించి చంద్రబాబు ఆదిని పిలిపించారు. దీంతో వెళ్లి చంద్రబాబును కలిసిన ఆదినారాయణ రెడ్డి.. తాజా రాజకీయాలపై చర్చించారు.వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇదే సమయంలో తాను వచ్చిన వైసిపిని, జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికల్లో టీడీపీ దారుణమైన ఓటమిని చవిచూడటంతో ఆది పార్టీ మారే ఆలోచన మొదలు పెట్టారు. వైసిపిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో బిజెపి నేతలతో సంప్రదించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఆశగా ఉన్న బిజెపి కూడా ఆది రాకపై ఆసక్తి కనబరిచింది. ఇంతలోనే చంద్రబాబు బుజ్జగించడంతో ఆది వెనక్కి తగ్గారు. కొన్ని అంశాలపై టిడిపి అధినేత నుంచి హమీ రావడంతో ఆది ప్రస్తుతానికి తన ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.