ప్రపంచాన్నే వణికించేస్తుంది కరోనా వైరస్. అయితే కరోనా బాధితులకు ఎంతో ఓపికతో వైద్యం చేస్తున్న వైద్యుల పనితీరును తప్పకుండా ప్రపంచమంతా ప్రశంసించాల్సిందే. ఒక్క వైద్యులే కాకుండా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఇలా ఎందరో తమ ప్రాణాలకు తెగించి కరోనావైరస్ ను అణచి వేసేందుకు కంకణం కట్టుకొని శ్రమిస్తున్నారు. ఇది కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల సేవలు మరువలేనివి. తాజాగా జర్మనీలో వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. అందుకు కారణం లేకపోలేదు. వైద్యులపై పేషెంట్లు దాడి చేసినందుకు కాదు. ఈ నిరసనలు. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే మరి.
ముఖ్యంగా జర్మనీలో వైద్యులు కరోనావైరస్ సోకిన పేషెంట్లకోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అందుకు వైద్యులు చేస్తున్న సేవలు మరువలేనివి. అలాంటిది తాజాగా అక్కడి వైద్యులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగ్నంగా ఉండి నిరసన తెలిపారు. ఎందుకు అలా చేశారు అంటే.. అందుకు కారణం ఉంది. ప్రతి రోజు డ్యూటీలో నిమగ్నమై ఉన్నవారికి వ్యక్తిగత సురక్షిత పరికరాలు (పీపీఈ)లు కొరత ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా సహనం కోల్పోయారు. పేషెంట్స్ వద్దకు వెళ్లాలంటే తప్పకుండా ఇవన్నీ ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పీపీఈలు కొరత ఉండటంతో వారు సహనం కోల్పోయి ఇలా నగ్నంగా నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు లేకపోయినప్పటికీ ముందుండి సేవలు చేశామని చెప్పిన వైద్యులు ఇక చేయలేమని స్పష్టం చేశారు. నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నగ్నంగా ఉండి నిరసనలు తెలిపారు. అలాగే.. హాస్పిటల్లోనే ఉంటూ టాయ్లెట్స్ మాటున, కుర్చీల వెనకాల, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ వెనకాల నగ్నంగా ఉండి నిరసనలు తెలిపారు. ఫ్రెంచి డాక్టర్ ఒకరు ఇలానే నిరసన తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చిందని అతడిని స్ఫూర్తిగా తీసుకొని తాము ఇలాంటి నిరసనకు దిగామని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అంతేకాకుండా తాము ప్రాణాలకు తెగించి కరోనా బారిన పడిన వారికి సేవలు చేస్తుంటే మాకే.. రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరిలోనే దేశంలోకి కరోనావైరస్ ఎంట్రీ ఇస్తే ఇప్పటికి కూడా పీపీఈల కోసం వైద్యులు నిరసన తెలపడం చాలా దారుణమని అందుకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆవేదన కలిగించే అంశంగా వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జర్మనీలో మాస్కులు, శానిటైజర్లు, ఇతర క్రిమి సంహారక మందులు పెద్ద ఎత్తున దొంగతనానికి గురౌతున్నాయి. ఇదంతా కొన్ని క్రిమినల్ గ్యాంగుల పనేనని జర్మనీ పోలీసులు వెల్లడిస్తున్నారు. దీంతో చాలా వరకు హాస్పిటల్స్ భద్రతను పెంచి మరింత కట్టుదిట్టం చేశామని వారు వెల్లడిస్తున్నారు. కాగా ఈ వైద్యుల నిరసనపై ప్రభుత్వం స్పందించింది. పీపీఈ కొనుగోళ్లను ఇక నుంచి కేంద్రీకృతం చేస్తామని స్పష్ట చేసింది.