Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి చల్లారాలంటే… ఆ దేశాధినేతలు ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. వీలైనంత వరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, చర్యలకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడే అధికారికంగా స్పందించాలి. కానీ… అమెరికా, ఉత్తరకొరియా రెండు దేశాలూ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తామని ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ చేసిన ప్రసంగంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత అమాంతంగా పెరిగింది. ట్రంప్ వ్యాఖ్యలను ఉత్తరకొరియా కుక్క అరుపులతో పోల్చడంతో పాటు… అమెరికా అధ్యక్షుణ్ని… కిమ్ మానసిక రోగితో పోల్చి పరిస్థితిని మరింత దిగజార్చారు.
ఉత్తరకొరియా దుందుడుకు వైఖరి గురించి అందరికీ తెలిసిందే… అభద్రతా భావంతోనో, ధైర్యంగా ఎదురు తిరగాలన్న నైజంతోనో ఆ దేశం తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. కానీ ప్రపంచ పెద్దన్నగా తనను తాను భావించే అమెరికా కూడా ఉత్తరకొరియా కు తాను ఏమాత్రం తీసిపోమని పలుమార్లు రుజువు చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కిమ్ తనను మానసిక రోగి అనడాన్ని ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. కిమ్ ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ట్విట్టర్ వేదికగా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరకొరియా అధ్యక్షుణ్ని పిచ్చివాడుగా అభివర్ణించారు. తన దేశ పౌరుల చావులను, ఆకలి బాధలను సైతం కిమ్ పట్టించుకోడని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇకపై పరిణామాలు కిమ్ ఇప్పటిదాకా ఎదుర్కోని విధంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరు దేశాధినేతలు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొనసాగిస్తే… పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తంచేస్తోంది.