బాబు నివాసంపై డ్రోన్ చక్కర్లు…బాబు సీరియస్…ఇద్దరి అరెస్ట్ 

Drone circles over Babu's residence ... Babu Serious ... Both arrested

కృష్ణా నది వరదలపై ఓ పక్క అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల వర్షం కురుస్తుండగా శుక్రవారం దానికి మరింత ఆజ్యం పోసే ఘటన జరిగింది. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ప్రయోగించారు.

ఈ విషయాన్ని గమనించిన టీడీపీ నేతలు ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు దేవినేని అవినాష్, టీడీ జనార్దన్ వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు.

పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసు జీపుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన నివాసంపై డ్రోన్ ఎగరడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

వెంటనే డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి నిలదీశారు. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కడా డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేదని, అలాంటిది ప్రతిపక్ష నేత ఇంటిపైనే డ్రోన్లు ఎగరడం ఏంటని ప్రశ్నించారు. హై సెక్యూరిటీ జోన్ ఉండే తన నివాసంపై డ్రోన్లు ఎందుకు ఎగరవేశారో తనకు సమాధానం చెప్పాలన్నారు.

మాజీ ముఖ్యమంత్రి భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? అని మండిపడ్డారు. డ్రోన్లు ఎగరేస్తూ పట్టుబడిన వ్యక్తులెవరో, ఆ డ్రోన్లలో ఏముందో, దాని వెనుక కుట్ర ఏమిటో వెంటనే దర్యాప్తు చేపట్టి తెలియజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు