డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌

డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌

నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్‌) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్‌లను ఆపరేట్‌ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్‌ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది.

ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్‌ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల అంగీకారం, ఆపరేటర్‌ అనుమతి, ఆర్‌అండ్‌ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్‌ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి.

డ్రోన్‌ల బదిలీ, రిజిస్ట్రేషన్‌ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్‌లు, ఆర్‌అండ్‌డీ సంస్థలకు పైలట్‌ లైసెన్స్‌ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్‌ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్‌ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్‌ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్‌ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్‌ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్‌లైన్‌లో పైలెట్‌ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది.

ఎయిర్‌ వర్తీనెస్‌ సర్టిఫికెట్‌ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫామ్‌లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్‌ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్‌–విండో ఆన్‌లైన్‌ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.