Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న కీలకమైన రెండో టెస్టులో ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్లతో సఫారీలను భయపెట్టిన భువీని రెండో టెస్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు తీసుకున్న ఈ నిర్ణయం వెనక పరమార్థం ఏమిటని మండిపడుతున్నారు. భువీకీ రెండో టెస్టులో విశ్రాంతి ఇవ్వడం నోట్ల రద్దు కంటే అతిపెద్ద నిర్ణయమని ఓ నెటిజన్ అభివర్ణించాడు.
ఇషాంత్ శర్మ మంచి బౌలర్ అయినప్పటికీ… భువీని తప్పించి ఇషాంత్ కు ఎందుకు అవకాశాన్ని కల్పించారో అర్ధం కావడం లేదంటున్నారు కొందరు నెటిజన్లు. భువీకి బదులు బూమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చుకదా అని సూచించారు. జట్టు ఎంపిక విషయంలో మేనేజ్ మెంట్ గందరగోళానికి గురయిందని, గత మ్యాచ్ లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ ను అందుకే తప్పించిందని విమర్శించారు. రహానేను జట్టులోకి తీసుకోకపోవడంపైనా అభిమానులు విరుచుకుపడుతున్నారు. బౌన్సీ ట్రాకులపై మంచి రికార్డు ఉన్న రహానే ఫామ్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.