కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నటి రాగిణి ద్వివేది నివాసంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీసీబీ అధికారులు ఆమెను శుక్రవారం వారి ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు. సోమవారం అయితే తాను విచారణకు వస్తానని లాయర్ ద్వారా నటి సమాధానం ఇచ్చింది. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారిగా నటి ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీసీబీ బృందం ఉదయం 6 గంటలకు రాగిణి ద్వివేది నివాసానికి చేరుకొని సోదాలు నిర్వహించారు.
మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. నటిని విచారించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తమ వాహనంలో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి కన్నడ చిత్ర పరిశ్రమలో సన్నిహితులున్న రవి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయిదు రోజుల పాటు కోర్టు అతన్ని పోలీసు కస్టడీకి పంపింది. చిత్రనిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ శాండల్‌వుడ్‌లో మాదకద్రవ్యాల గురించి సీసీబీకి ఫిర్యాదు చేశాడు. ఇండస్ట్రీలో కనీసం 15 మంది డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.