న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ మహిళ హంగామా సృష్టించింది. అంతేకాదు ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మాయాపూరిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ పాండే, మాధురి దంపతులు కలిసి యాక్టివాపై వెళ్తున్నారు. అనిల్ పాండే హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వారి బైక్‌ను ఆపారు. దీంతో మాధురి ఓ ట్రాఫిక్ పోలీసుతో దుర్భషలాడుతూ.. అతనిపై దాడి చేసింది. ఈ క్రమంలో అనిల్ పాండే కల్పించుకొని.. తామిద్దరం పార్టీలో ఉండగా.. మాధురి సోదరుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. అందుకే తాము త్వరగా వెళ్లాలి.. వదిలిపెట్టండి అని పోలీసులను కోరాడు. పోలీసులేమో బైక్‌ను రోడ్డు పక్కకు పార్క్ చేయాలని అనిల్‌ను ఆదేశించారు. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఇతరులపై కూడా మాధురి దాడి చేసింది. మొత్తానికి వీరిద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం రాత్రి అనిల్, మాధురిని పోలీసులు అరెస్టు చేశారు.