పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌లో ‘మంచ్‌కిన్’ చాలా ఫేమస్. ఎవరీ మంచ్‌కిన్ అనేకదా మీ డౌట్! ఇది ఒక బాతు. 20 యేళ్ల క్రిస్సీ ఎలిస్ పెంపుడు జంతువే ఈ మంచ్‌కిన్ అనే బాతు. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడే పెంపుడు జంతువుగా ప్రసిద్ధి కెక్కింది. ఎలాగంటే..క్రిస్సీకి చిన్నప్పటి నుంచి బాతులను పెంచే అలవాటుంది. ఐతే టీనేజ్‌లో ఉన్నప్పుడు మంచ్‌కిన్ ఆమె దగ్గరికి చేరింది.
సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీరిద్దరికీ కలిపి ‘డంకిన్ డక్స్’ అనే పేరుతో కామన్ ఎకౌంట్ కూడా క్రిస్సీ తెరిచేసింది. తను ఉండే టౌన్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డంకిన్ డొనట్స్ పేరు ప్రేరణతో ఈ పేరు పెట్టిందట. ఇక అప్పటినుంచి వీరిద్దరి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ఆమె ఇలాంటి ఆసక్తులు, అభిరుచులను పంచుకునే వ్యక్తులతో కనెక్ట్ అయ్యింది. దీనికి టిక్‌టాక్‌లో 2.7 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర లక్షలు ఫాలోవర్స్ ఉన్నారంటే నమ్మబుద్ధికావట్లేదు కదా!
ఈ క్రమంలో రెండు సోషల్ మీడియాల ద్వారా నెలకు ఏకంగా 3,34,363ల రూపాయలు తన యజమానికి సంపాదించి పెడుతుందట ఈ బాతు. అంతేకాకుండా పెయింటింగ్‌ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. దీంతో న్యూయార్క్ పోస్ట్ నివేదిక ‘కష్టపడి పనిచేసే పెట్’ అని పేర్కొంది. సాధారణంగా క్యూట్ గా ఉండే రకరకాల జంతువుల వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఈ బాతు వీడియోలు మరింత క్రేజీగా దూసుకుపోతున్నాయి.