తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న దుల్కర్ సినిమా

తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న దుల్కర్ సినిమా

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తమిళ సినీ ప్రేక్షకులకు క్షమాపనలు చెప్పారు. దుల్కర్‌ నటించిన వారణే అవశ్యముండే చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. అయితే ఈ చిత్రంలోని ఓ చిన్న సన్నివేశ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని పలువురు తమిళ ప్రేక్షకులు ఆరోపించారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దుల్కర్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ ప్రారంభించారు. దుల్కర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో తన తరఫున, చిత్ర యూనిట్‌ తరఫున వారికి‌ క్షమాపణలు చెబుతూ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

‘వారణే అవశ్యముండే చిత్రంలో ప్రభాకరన్‌ జోక్‌ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. ఇది కావాలని చేసింది కాదు. 1988లో వచ్చిన మలయాళ చిత్రం పట్టణ ప్రవేశం చిత్రంలోని జోక్‌ స్పూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించాం. అది కేరళలో మీమ్స్‌గా బాగా ఫేమస్‌. ఇది కేరళలో సాధారణమైన పేరు కావడంతో.. అందుకే చిత్ర ప్రారంభంలో ఇది ఎవరికి ఉద్దేశించింది కాదని పేర్కొన్నాం. చాలా మంది సినిమా చూడకుండానే ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. నాపై, మా దర్శకుడు అనుప్‌ విమర్శలు చేయడాన్ని మేము అంగీకరిస్తాం. కానీ మా కుటుంబ సభ్యులను, సినిమాలో నటించిన సీనియర్‌ నటులపై దయచేసి విమర్శలు చేయకండి.

ఈ సన్నివేశం ద్వారా బాధపడిన దయ హృదయం కలిగిన తమిళ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. నా సినిమాల ద్వారా, మాటల ద్వారా నేను ఎవరినీ కించపరచాలని చూడను. దీనిని కచ్చితంగా అపార్థం చేసుకున్నారు. కొందరు చాలా అసభ్యకరంగా విమర్శలు చేయడంతోపాటుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాతో పాటు కుటుంబాన్ని కూడా దూషించడం చాలా బాధగా అనిపిస్తుంది. వారు ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను’ అని దుల్కర్‌ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో దుల్కర్‌తో పాటుగా శోభన, కల్యాణి ప్రియదర్శన్‌, సురేష్‌ గోపి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.