Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సివిల్స్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్నాడు. నిన్నా సాయంత్రం సివిల్ సర్వీసెస్ – 2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ సాధించగా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అను కుమారి రెండో సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించారు. యూపీఎస్సీ ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 990 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసింది. ఇందులో 750 మంది పురుషులు కాగా 240 మంది మహిళలు ఉన్నారు. ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఏటా దాదాపు 11 లక్షల మంది హాజరవుతుంటారు. అందులో 990 మందిని వడపోసారు అంటే అక్కడ ఎంత కాంపిటీషన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. అనుదీప్ 1వ ర్యాంక్,శీలం సాయితేజ 43, నారపురెడ్డి శౌర్య 100, మాధురి 144, వివేక్ జాన్సన్ 195, అక్షయ్ కుమార్ 624, భార్గవ శేఖర్ 816వ ర్యాంకులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంక్ సాధించారు. ఫలితాల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సత్తా చాటారు. టాప్ 25 ర్యాంకుల్లో 8 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను గతేడాది జూన్ 18న నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ పరీక్షల్లో పాసైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.