‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఇటీవల పట్టుబట్టి ఒకేసారి ఎన్నికలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జమిలీ ఎన్నికలకు సంబంధించి సాధ్యాసాధ్యాలు తెలుపాలంటూ నిన్న అమిత్షా లా కమిషన్కు లేఖ రాశారు. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అంతేకాక చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉండడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఈ లేఖలో పేర్కొన్నారు.
అయితే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని భారత ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. జమిలి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా లా కమిషన్కు లేఖ రాసిన మరుసటి రోజే ఈసీ ఈ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది లోక్సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం పేర్కొంది. ‘‘ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సరిపడినన్ని వీవీపీఏటీలు మా వద్ద లేవు..’’ అని ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ పేర్కొన్నారు. వీవీపీఏటీ మెషీన్ల కోసం సకాలంలో ఆర్డర్ చేయాల్సి ఉందనీ.. జమిలి ఎన్నికలపై రెండు మూడు నెలల్లోగా తుదినిర్ణయం ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.