Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బీజేపీతో జతకట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పుడు పార్టీ గుర్తును కూడా చేజెక్కించుకున్నారు. జేడీయూ చిహ్నమయిన బాణం నితీశ్ కుమార్ కే చెందుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. జేడీయూ పార్టీ కూడా ఆయనదే అని స్పష్టంచేసింది. గత ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీచేసిన జేడీయూ ఇటీవల ఆ పొత్తును తెగతెంపులు చేసుకుని ఎన్డీఏలో చేరింది. ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ అనంతరం బీజేపీ మద్దతుతో తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో నితీశ్ వ్యవహారశైలిపై జేడీయూ లో మరో సీనియర్ నేత శరద్ యాదవ్ బహిరంగంగా విమర్శలకు దిగారు.
మహాకూటమి నుంచి తాను బయటకు రానని, అసలైన జేడీయూ కూడా తనదేనని వాదించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా ఉన్న శరద్ యాదవ్ ను నితీశ్ ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయినా శరద్ యాదవ్ వెనక్కి తగ్గలేదు. నితీశ్ ను వ్యతిరేకించే మరికొందరు శరద్ యాదవ్ పక్షాన చేరడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. అసలైన జేడీయూ తమదంటే తమదని రెండు వర్గాలు వాదనకు దిగాయి. పార్టీ గుర్తయిన బాణాన్ని తమకే కేటాయించాలని కోరుతూ ఈసీని ఆశ్రయించాయి. ఇరువైపులా నేతల బలాబలాలను పరిశీలించిన ఈసీ బాణం గుర్తు, పార్టీ నితీశ్ కే చెందుతుందని వెల్లడించింది. జేడీయూ నేతల్లో ఎక్కువ మంది నితీశ్ కే మద్దతు తెలపడంతో ఆయనకే పార్టీని, గుర్తును కేటాయిస్తున్నట్టు ఈసీ స్ఫష్టంచేసింది.