తెలుగుదేశం పార్టీ ఎంపీ మాజేమంత్రి సుజనా చౌదరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు వదిలి పెట్టడం లేదు. నెలలో రెండో సారి సుజనా చౌదరి వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు చేశారు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్స్‌లో ఈడీ అధికారులు గత రాత్రి నుంచే సోదాలు జరుపుతున్నారు. గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించి హార్డ్ డిస్క్ లు, ఫైల్స్ తో పాటు కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. అలాహే సుజనా చౌదరికి చెందిన వ్యాపార సంస్థలు బ్యాంకుల నుంచి రూ. 304 కోట్లు రుణాలు తీసుకుని వాటిని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. బ్యాంకులు సుజనా చౌదరిపై ఫిర్యాదు చేశాయని సీబీఐ కేసులు నమోదయ్యాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకుల నుంచి సుజనా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 304 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు తెలుస్తుండగా సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ. 124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 120 కోట్లు, ఆంద్రాబ్యాంక్ నుంచి రూ. 60 కోట్లు రుణాలను సృజన గ్రూప్స్ పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సృజన గ్రూప్స్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ కళ్యాణ్‌రావ్ పేరుతో ఈ ఋణాలు పొందినట్లు తెలుస్తుండగా సీబీఐ మాజీ డైరెక్టర్ అయిన విజయరామారావు కొడుకు శ్రీనివాస్ కళ్యాణ్ రావుగా గుర్తించారు. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ కల్యాణ్ రావ్ మీద 2016 లో సీబీఐ కేసునమోదు చేసింది. ప్రస్తుతం మర్షియస్ కమర్షియల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహిస్తుండగా ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే నెల వ్యవధిలోనే రెండో సారి సుజనా చౌదరిపై ఈడీ దాడులు చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలపై కేంద్ర కుట్ర పూరితంగానే దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు.
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. కొద్ది రోజులుగా టీడీపీకి ఆర్థిక సహకారం అందిస్తారని పేరు ఉన్న నేతలు, వ్యాపార సంస్థలపై.. ఐటీ, ఈడీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. సీబీఐ కూడా రంగంలోకి దిగబోతోందన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. దీంతో సీబీఐకి ఏపీలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఏ కేసు అయినా ప్రభుత్వం అనుమతిస్తేనే సీబీఐ ఏపీ పరిధిలో అడుగు పెట్టాలి. చివరికి బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలపైన కూడా ఏపీ ప్రభుత్వ అనుమతితోనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో కేంద్రమంత్రిగా ఉండటంతో ఆయనకు చాన్నాళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఆ తర్వాత ఆయన కేంద్రం మీద పార్టీతో కలిసి పోరాటం మొదలు పెట్టేసరికి ఆయన మీదకి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడి మొదలయ్యంది. దీంతో ఆయన సైలెంటయ్యారు. దాంతో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇటీవల మళ్లీ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారు. దాంతో ఈడీ ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. ఈ కేసు ఇంకెన్నాళ్ళు లాగుతుందో ఈడీకే ఎరుక.