తెలంగాణాలో ఎన్నికల ప్రచార పర్వం ఈరోజు సాయంత్రం 5 గంటలకి పూర్తిగా ముగిసింది. కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి గడువు నేటితో ముగియనుండటంతో, రాజకీయ పార్టీలన్నీ తమ శక్తి మేర కృషివంచన లేకుండా కష్టపడ్డాయి. తన ఆఖరి ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ గజ్వేల్ లో నిర్వహించిన సభతో ముగించగా, ప్రజాకూటమి కోదాడ లో నిర్వహించిన సభ తో ముగించింది. ఇప్పటివరకు తమ నియోజకవర్గం లోని ప్రతి ఊరికి, వీధికి తిరిగి చేసిన ప్రచారంతో అలసిపోయిన పార్టీల నేతలు, కార్యకర్తలకి ఈరోజు సాయంత్రం తో విరామం దొరికినట్టయ్యింది.
ఎన్నికల పోలింగుకి ఇంకా రెండు రోజులే గడువు ఉండడం తో, ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి పోలింగు ముగిసే వరకు మద్యం అమ్మకాలను నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారి పైన జరిమానా తో కూడిన, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఈసీ పేర్కొంది. ఇవే కాకుండా ఒపీనియన్ పోల్స్, సర్వేలు వంటివి వెల్లడించరాదని ఆదేశాల్ని జారీ చేసింది. ఎన్నికల పోలింగు తేది అయిన డిసెంబర్ 7 న కార్యాలయాలు విధులు నిర్వహించరాదని ఈసీ ఆదేశించింది.