మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసి.. 15 రోజుల్లోగా ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నది. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయపరిమితిని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రెట్టింపు చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయపక్షాలతో సోమవారం రాష్ట్ర ఎన్నికలసంఘం కార్యాలయంలో కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోసం తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు, షెడ్యూల్ విడుదల, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయపార్టీలకు స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. సమావేశానికి హాజరైన ఆయా రాజకీయపార్టీల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేసిన 15 రోజుల వ్యవధిలో మున్సిపాలిటీ పోలింగ్ నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నది. ప్రస్తుతం వార్డులవారీగా ఓటరు జాబితా ముసాయిదా సిద్ధమవుతున్నదని, దానిని ఈ నెల 10న విడుదల చేస్తామని తెలిపింది. 129 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో 60 లక్షల మంది ఓటర్లున్నట్టు అంచనా వేస్తున్నామని వివరించింది.
వార్డులవారీగా ఓటరు జాబితా విడుదల చేస్తామని, మున్సిపల్ కమినర్లు ఈ నెల 12 వరకు ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తారని ఎస్‌ఈసీ కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 14 వరకు తుదిఓటరు జాబితాను విడుదల చేస్తామని, వార్డులవారీగా రిజర్వేషన్లను కూడా అదేరోజు ఖరారు చేస్తామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితా తయారుచేస్తున్నామని.. ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. వచ్చే కొత్తఓట్లను అనుబంధ జాబితా కింద విడుదల చేస్తామని, బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ప్రతివార్డులో ఎంతమంది ఓటర్లున్నారో తెలిశాకే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, ఈ నెల 19 వరకు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఈ నెల 12న పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల చేస్తామని, ఒక్కోపోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లుంటారని తెలిపారు. ఈ నెల 13న మున్సిపాలిటీల వారీగా కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్ రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహిస్తారని ప్రకటించారు.