ఈ సారి జరిగిన ఎన్నికలు ఎంత వివాదాస్పదంగా జరిగాయో ఇప్పుడు జరగాల్సిన కౌంటింగ్ కూడా అంత కన్నా ఎక్కువ వివాదాస్పదంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ విషయానికి వస్తే తమ తమ అభ్యంతరాలు రెడీగా పెట్టుకున్నాయి టీడీపీ, వైసీపీ. ఈసారి కౌంటింగ్ నిబంధనలు కూడా మారాయి దీంతో ఈసారి అధికారికంగా ఫలితాలు తెలుసుకోవాలంటే… గతంలో కంటే 6-7 గంటలు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి లెక్కింపు రోజున ఉదయం 10-11 గంటలకు ట్రెండ్స్ తెలిసిపోతాయి. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చేస్తాయి. అప్పటికే ఎవరి పొజిషన్ ఏంటో అన్న దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఈసారి ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రతి శాసనసభ స్థానం నుంచి ఐదు చొప్పున వీవీప్యాట్లను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. వాటిలోని చిటీలను లెక్కించాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే తుది ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. అయితే సగటున ఒక్కో వీవీప్యాట్లో చీటీలు లెక్కించేందుకు గంట సమయం పడుతుందని అంచనా. ఆ లెక్కన గత ఎన్నికల కంటే కనీసం ఆరు, ఏడు గంటల పాటు ఫలితాలు ఆలస్యం అవుతాయని చెబుతున్నారు. ఇక్కడ మరో నిబంధన కూడా ఉంది. ఈవీఎంలలో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించిన తర్వాత మాత్రమే వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రారంభం కావాలి. అంటే ఇంతకుముందు వరకు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఫలితం వెల్లడైతే ఈసారి అది రాత్రి 7-8 గంటల సమయంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇదంతా ఎక్కడా తేడా పడకపోతేనే ఎక్కడైనా పోరపాటున ఈవీఎంలో వచ్చిన ఓట్లకు.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కకు ఒక్క అభ్యర్థి విషయంలో తేడా వచ్చినా రీకౌంటింగ్ చేయాలి. అప్పుడు ఫలితాల ప్రకటన అర్ధరాత్రి వరకూ వెళ్లే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఈవీఎంలలో వచ్చిన ఓట్ల సంఖ్య, వీవీ ప్యాట్ చీటీల లెక్కింపులో వచ్చిన ఓట్ల సంఖ్య సరిపోలితేనే ఫలితాలు ప్రకటిస్తారు. సో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంట రేపనున్నాయి అనేది సుస్పష్టం.