భారత్లో ఈ ఏడాది మరోసారి ఎన్నికల సందడి షురూ అయింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 119 .. మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్లో 200, ఛత్తీస్గఢ్లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడిస్తున్నారు.
’40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు.’ అని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మిజోరాం అసెంబ్లీఎన్నికలకు ఈనెల 13న నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.