క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు ముగించి పండగ జరుపుకొంటున్న ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో ప్రకటనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ పండుగను పవిత్రంగా జరుపుకొంటున్న ముస్లిం మత విశ్వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మానవత్వపు విలువలను ప్రబోధించే దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసం ఎంతో పవిత్రమైంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇస్లాం మత విశ్వాసులకు పండగ తరుణాన శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానని వెల్లడించారు.