ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులక్ అలర్ట్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు వీరంతా తమ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను ఫస్టియర్, సెకండియర్ కలిపి ఒకేసారి విడుదల చేయనున్నారు. దాదాపుగా ఈ నెల 12న ఈ రెండు ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అప్ లోడ్ చేస్తారు. ఇక ఏపీలో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈనెల 8వ తేదీతో ముగియనుంది.