ఇవాళ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. ఇవాళ ఉదయం పోలీసు అకాడమీలో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట వెళ్తారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు సంధించే అవకాశం ఉంది.
మరోవైపు జాతీయ పోలీస్ అకాడమీలో 175 మంది ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్ జరగనుంది. భారత్కు చెందిన 155 మందితో పాటు.. 20 ఫారెన్ ట్రైనీ ఆఫీసర్‌లు 75వ బ్యాచ్లో కలిసి శిక్షణ పొందారు. 155 మంది ఐపీఎస్లలో 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన (75వ బ్యాచ్ లో తెలంగాణ నుంచి 5గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు) వారుండగా.. 123 మంది పురుషులు, 32 మంది మహిళలున్నారు. వేరే ఉద్యోగాలు చేస్తూ ఐపీఎస్ సాధించిన వాళ్లు 91 మంది ఉండగా.. నేరుగా ఐపీఎస్ సాధించిన వాళ్లు 64 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ బ్యాచ్లో ఎక్కువగా ఇంజినీరింగ్ విద్య నుంచి వచ్చిన వాళ్లే ఉన్నట్లు వెల్లడించారు.