ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార పార్టీ నాయకులు చేపడుతున్న నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై విచారణ చేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు తెదేపా, జనసేన నాయకులతో కలిసి మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వర్గీయులు పంపిణీ చేసిన కొన్ని పట్టాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయో లేదో తనిఖీ చేయాలని నాలుగు గంటల పాటు బైఠాయించారు. అభ్యంతరం లేని ప్రభుత్వస్థలాల క్రమబద్ధీకరణకు ఇచ్చిన జీవో మాటున రహదారులు, మడుగు భూములు, శ్మశానవాటికలకు సంబంధించిన స్థలాలను ఫోర్జరీ సంతకాలతో ఎలా పంచిపెడుతున్నారని ప్రశ్నించారు.
ఈ విషయం పై రెండు నెలల క్రితమే తాము అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవన్నారు. కచ్చితమైన వివరాలు ఇచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని, పట్టా తీసుకున్న లబ్ధిదారుడు వచ్చి ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో పరిశీలన చేయగలమని తహసీల్దార్ సతీష్ వచ్చి సమాధానం ఇచ్చారు. ఈ స్పందనపై కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.