ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్ల పాలన దోపిడీలు, కబ్జాలతో కొనసాగిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రి విమర్శించారు. ప్రతి ఒక్కరూ వారి పొలాలు, స్థలాలను వైకాపా నేతలు కబ్జా చేయకుండా కొన్ని రోజులపాటు జాగ్రత్తగా చూసుకోవాలని, తెదేపా అధికారంలోకి వచ్చాక వాటిని రక్షిస్తుందని హామీ ఇచ్చారు. కల్తీ మద్యం , ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, మహిళలపై దాడుల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ మొదటి స్థానంలో నిలబెట్టారని ఆమె విమర్శించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా YSR జిల్లా పోరుమామిళ్లలో భువనేశ్వరి గురువారం పర్యటించారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో మరణించిన మున్నెల్లి అంకమ్మ, సయ్యద్ మహబూబ్చాంద్ల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ ‘ప్రజల్లో బలంగా నిలిచిపోతారనే కుట్రతోనే చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టింది. ఆయనపై పెట్టిన ఒక్క కేసును కూడా నేటికీ నిరూపించలేకపోయారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక దారుణాలను తెదేపా నేతలు, కార్య కర్తలు సమర్థంగా ఎదుర్కొన్నారు. కార్యకర్తలు రక్షణగా ఉన్నారనే ధైర్యంతోనే నేను అనేక సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నా. ఎన్నికల్లో పార్టీని గెలిపిం చుకోవడానికి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ఓటు అనే ఆయుధంతో ఈ పాలనను అంతం చేయాలి’ అని స్పష్టం చేశారు. భువనేశ్వరి తమ ఇంటికి రావడంతో బాధితులు భావోద్వేగానికి లోనయ్యా రు. ఆమెకు YSR, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, చమర్తి జగన్మోహన్రాజు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, కడప తెదేపా అభ్యర్థి మాధవి స్వాగతం పలికారు.